Sunday, January 7, 2024

Koraput and Other stories

 

Koraput and Other stories, a collection of English stories based on the landscape of Southern Odissa and which was penned by eminent Writer Sri Gourahari Das. My small review appeared recently on it in Telugu prabha daily.

Tuesday, September 26, 2023

కేరళ లోని మాతృవ్యవస్థ పై వచ్చిన ఓ మంచి నవల "The Grande Matriarch of Malabar"

 


The Grande Matriarch of Malabar అనే పుస్తకం ఇటీవల చదివాను.సజిత నాయర్ అనే రచయిత్రి కేరళ రాష్ట్రం లో ఒకప్పుడు ప్రబలం గా ఉన్న తరవాడ్ వ్యవస్థ పై రాసిని నవల ఇది. మాతృస్వామ్యం ఒకప్పుడు ఆ ప్రాంతం లో వర్ధిల్లిన సంగతి మనకి ఎంతో ఒకంత తెలుసు. మరి ఈ కేరళ రాష్ట్రానికి చెందిన రచయిత్రి ఏం రాశారో చూద్దామని చదివాను.

భూస్వామ్య మరియు ఫ్యూడల్ వర్గం గా చెప్పదగిన  నాయర్ కులం లో ఈ తరవాడ్ సంస్కృతి ప్రబలింది. ఒక పెద్ద ఇల్లు,దాని చుట్టూ తోటలు,అనేక ఎకరాల ఎస్టేట్ ఇలా ఉండే ఒక ఉమ్మడి కుటుంబం ...ఆ కుటుంబానికి అధిపతి గా ఒక స్త్రీ ఉంటుంది. ఆ ఇల్లు,ఆస్తిపాస్తులు అన్నీ ఆవిడ పేరు మీదనే ఉంటాయి. ఆమె తదనంతరం కూతురుకి అవి చెందుతాయి.లేదా కూతురు కూతురు కి ఇవ్వవచ్చు. ఇంటిపేరు కూడా భర్త ది ఉండదు.సంతానాన్ని కనడం వరకే తప్పా ఆస్తిపాస్తుల మీద ఎలాంటి అధికారం ఉండదు.

టూకీగా అలా ఉండే కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం అని ఈ నవల చదివాను. రచయిత్రి సజిత నాయర్ కూడా అదే వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కనక ఆసక్తి పెరిగి తెప్పించాను. మొత్తం 238 పేజీల్లో సాగింది. ఆసక్తికరం గా ఉంది రాసిన విధానం. Kalydath కుటుంబానికి చెందిన తరవాడ్ యొక్క కథ ఇది. ఆ తరవాడ్ కుటుంబ పెద్ద దాక్షాయణి అమ్మ. లంకంత ఇల్లు, భూమి పుట్రా బాగానే ఉంటుంది.కథ మొత్తం ఎక్కువగా 70 వ దశకానికి ముందు సాగి ఆ తరవాత మెల్లగా వర్తమానం లోకి వస్తుంది.

  రోహిణి, దాక్షాయణి అమ్మ మనవరాలు. ఆమె అమెరికా నుంచి ఈ వచ్చి తరవాడ్ లో ఉన్న పాతతరం ఇంటిని అమ్మివేసి డబ్బు తీసుకుపోవాలని ఇక్కడకి వస్తుంది. ఆమె కుటుంబీకులు చాలామంది అప్పటికే చనిపోయి ఉంటారు. ఎన్నిసార్లు అమ్మాలని చూసినా ఏదో ఆటకం వచ్చి కొనేవాళ్ళు వెనక్కి తగ్గుతుంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో దాక్షాయణి అమ్మ ఆత్మ ఉందని అది బయటవాళ్ళని ఎవర్నీ ఇంటిని కొననివ్వదని చెబుతుంటారు.

ఈ రోహిణి మాత్రం అవి నమ్మదు. కాని ఆమె అక్కడ పడుకున్నప్పుడు మాత్రం కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. చుట్టుపక్కల ఉండే మరో పెద్దావిడ దాక్షాయణి అమ్మ జీవితం గురించి వివరిస్తుంది. ఆ వివరణ లో భాగం గానే కథ అంతా సాగుతుంది. ఆ రోజుల్లో ఆవిడ ఎలా జీవించింది,తన సోదరుని సాయం తో ఎలా కుటుంబాన్ని నెట్టుకొచ్చిందీ,పిల్లల్ని ఎలా పోషించిందీ,మూగ చెవుడు ఉన్న కుమార్తె కి పెళ్ళి చేయడానికి పడిన కష్టాలు,కుమారుడు అచ్యుతన్ చేతికి అంది రావడం, అతని జీవిత విధానం, భర్త బయటకి వెళ్ళి వేరే స్త్రీ ని చేసుకోవడం,దైనందిన జీవితం లో వివిధ వర్గాల మధ్య ఘర్షణలు ఇవి అన్నీ మనం దీనిలో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.

కొడుకు ఎంత సాయం చేసినా తరవాడ్ సంస్కృతి ప్రకారం కుమార్తె కుమార్తె కే ఇంటిని ,ఆస్తిని ఇవ్వాలనుకోవడం దానికి కొడుకులు అందరూ వ్యతిరేకించడం పాతతరం మరుమక్కతాయం చట్టాలు 1975 తోనే పోయినాయని వాదించడం ఇలా కేరళకి మాత్రమే పరిమితమైన కొన్ని విషయాల్ని ఈ నవల లో చదవవచ్చు. ఆనాటి కేరళ సమాజం లో కరుడు గట్టిన నమ్మకాలు ఓ వైపున ఉంటే , దాన్ని పూర్తిగా వ్యతిరేకించి పోరాడిన మనుషులు ఓ వైపున ఉన్నారు. అలా పరస్పర వైరుధ్యాలు కనబడతాయి.

అసలు దేశం లో ఎక్కడా లేని ఈ తరవాడ్ విధానం ఇక్కడ ఎందుకు ప్రబలింది అని లోపలికి వెళితే ఆ రోజుల్లో నాయర్ పురుషులు ఎక్కువగా యుద్ధాల్లోనూ వాటిల్లోనూ మరణించడం వల్ల , స్త్రీలు నంబూదిరి బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కనడానికి అనుమతించిడం జరిగింది. అతను కేవలం పిల్లల్ని కనే ప్రక్రియ లో ఉపయోగపడటానికే తప్పా స్త్రీ మీద గాని,ఆమె ఆస్తి మీద గాని ఎలాంటి అధికారం ఉండదు.అక్కడ బ్రాహ్మల్లో కూడా పెద్ద కొడుకు కే వివాహం అదీ. ఆ తరవాత వాళ్ళు నాయర్ యువతులతో సంబంధాలు పెట్టుకునేవారు. మరి ఇలాంటి గమ్మత్తు వ్యవస్థ ని చూసే స్వామి వివేకానంద లాంటి ఆయన కూడా సెమీ క్రాక్ పీపుల్ అన్నాడేమో ...ఇంకా రాస్తాను. ఇప్పటికి ఇది. అమెజాన్ లో ఉందీ పుస్తకం.

--- మూర్తి కెవివిఎస్       

Wednesday, July 26, 2023

' బడదీదీ' సంస్థ వాళ్ళకి కొన్ని పుస్తకాలు పంపుతున్నాను,వీలైతే మీరూ పంపవచ్చు

 ఎవరైనా సరే గ్రంథాలయం నడుపుతున్నాం,కొన్ని పుస్తకాలు పంపమని అడిగితే అది ఏ జిల్లా, ఏ రాష్ట్రం అని కూడా చూడకుండా నాకు తోచిన పుస్తకాలు ఏవో పంపుతూనే ఉంటాను. అది మొదటి నుంచి ఉన్న ఓ వీక్నెస్. ఎందుకంటే పుస్తకం చదివాలనే కుతూహలం అన్ని అలవాట్ల లో కెల్లా చాలా మంచిది. సాధ్యమైనంత మంది దగ్గరకి పుస్తకం వెళ్ళాలి అనేది నా లక్ష్యం.అందుకనే ఈ మధ్య ఓ గ్రామసీమ నుంచి అదీ వెనకబడిన ప్రాంతం నుంచి ఓ ప్రకటన.ఇక నేను ఎందుకు ఊరుకుంటాను.

వెంటనే ఓ అయిదు పుస్తకాలు పోస్ట్ లో పంపేశాను. ఎక్కడకి అని అడుగుతున్నారా...ఒరిస్సా లోని మల్కాన్ పూర్ జిల్లా లోని ఓ గ్రామం.అక్కడ బడదీదీ అనే స్వచ్ఛంద సంస్థ వారు ఆరుబయట గ్రంథాలయాన్ని నడుపుతున్నారు.కొన్ని ఇంగ్లీష్,హిందీ,ఒడియా, బెంగాలీ పుస్తకాలు ఉన్నాయి.ఇంకా ఎవరైనా దాతలు పుస్తకాలు ఇస్తే తీసుకుంటామని వాళ్ళ ఫేస్ బుక్ లో పెట్టారు .దానితో నా పర్సనల్ లైబ్రరీ లో ఉన్న ఓ అయిదు పుస్తకాలు పంపాను.

భవిష్యత్ లో కూడా నా వీలు ని బట్టి పంపుతాను. వాళ్ళు ఆరుబయట గ్రంథాలయం మాత్రమే కాకుండా ఆడపిల్లల ఆరోగ్యం కోసం కూడా పనిచేస్తున్నారు. ఇదంతా నడిపే ముఖ్య కార్యకర్త ఒక ఆదివాసి అమ్మాయి. ఈమె కళింగ టివి అనే మీడియా హౌస్ లో పనిచేస్తూనే తమ ప్రాంతానికి ఏదో చిన్న పనైనా చేయాలని ,ఉత్సాహం ఉన్న మిగతా యువతులతో ఒక టీం గా ఏర్పడి ఈ పని చేస్తున్నారు. కనుక ఏదో ఉడతాభక్తి గా నేను ఈ కొన్ని పుస్తకాలు పంపుతున్నాను.   

Tuesday, June 20, 2023

తంగేడు పక్షపత్రిక లో ప్రచురితమైన నా కథ "ఆ రెండు చెట్లు"

 







తంగేడు పక్షపత్రిక లో ప్రచురితమైన నాకథ "ఆ రెండు చెట్లు" (16-30 June, 2023 issue)

Sunday, May 28, 2023

ఆత్మల తో కొందరి రచయితల అనుభవాలు

 ఇప్పుడే "నీలివెలిచం"(Blue radiance) అనే మళయాళ చిత్రాన్ని అమెజాన్ ప్రైం లో చూశాను. ఇది వైకోం ముహమ్మద్ బషీర్ యొక్క కథ.ఇంతకు ముందు ఈ సినిమాని అయిదు దశాబ్దాల కిందట తీసినప్పటికీ మళ్ళీ ఈ ఏడాది లో తీశారు. కథ అతీంద్రియ ఆత్మ ఇంకా అలాంటి జోనర్ గా చెప్పవచ్చు.సినిమా ఆసక్తి గా సాగింది.చనిపోయిన ఓ యువతి ప్రేతాత్మ, నివసించే పాడుబడ్డ భవనం లోకి ఓ రచయిత వచ్చినపుడు తారసపడిన అనుభవాలే ఈ కథ.

ఆనాటి మపాసా నుంచి మొన్నటి బషీర్ ఇంకా నిన్నటి ఆర్.కె.నారాయణ్ వరకు ప్రసిద్ధ రచయితలు చాలామంది కొన్ని అతీంద్రియ అనుభవాల్ని పొందినవారే.వాటిని వివిధ కధల్ని పొదిగిన వారే.కొంతమంది లోకం దృష్టిలో పల్చనవుతాం అని వేరే వాళ్ళ అనుభవాలుగా వర్ణిస్తే మరికొందరు తమ కోసం రాసుకున్నారు.అవి ఆ తర్వాత బాగా ప్రసిద్ది పొందాయి. 

Le Horla ఇంకా Qui sait? వంటి ఫ్రెంచ్ కథల్లో మపాసా చిత్రించిన Supernatural phenomena తను పొందిన అనుభవాలుగానే చెప్పాడు.అలాగే ఆర్.కె.నారాయణ్ కూడా The English Teacher నవల లో చనిపోయిన భార్య ఆత్మ తో మాట్లాడటానికి చేసిన ప్రయోగాలు చదివాము గదా.నారాయణ్ నిజజీవితం లో కూడా ఈ ప్రయోగాలు చేశాడు.ఆయన కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ విషయం అనేక వ్యాసాల్లో రాశారు.

అలానే ఈ మళయాళ సినిమా మొదట్లో బషీర్ గారి మాటలు ఇంగ్లీష్ లో ఇలా వేశారు. "నా జీవితం లో పొందిన కొన్ని అంతుతెలియని అనుభవాల్లో ఇది ఒకటి. దీన్ని ఒక బుడగ అని భావిస్తే ,హేతుదృష్టి అనే సూది తో దాన్ని పగలగొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాను.మీరూ ప్రయత్నించి చూడండి ".      

----- Murthy kvvs


Sunday, May 14, 2023

A review on "Gourahari Das Kathalu" in Eenadu Daily (Sunday suppliment)

 


30-4-2023 నాటి ఈనాడు దినపత్రిక (ఆదివారం అనుబంధం) లో నా అనువాద పుస్తకం పై రివ్యూ (గౌరహరి దాస్ కథలు)

Tuesday, May 2, 2023

"కోరాపుట్ అండ్ అదర్ స్టోరీస్ "


 "కోరాపుట్ అండ్ అదర్ స్టోరీస్ " అనే ఈ ఆంగ్ల కథాసంపుటిని చదవడం ఒక మరపురాని అనుభవం  లా మిగిలిపోతుంది అంటే అతిశయోక్తి కాదు. గౌరహరి దాస్ గారు ఒరియా భాష లో రాసిన కథల్ని ఇలా ఆంగ్లభాష లోకి సరోజ్ మిశ్రా,గోప నాయక్ అనువదించారు. ఇంతకుముందు కూడా ఓ పుస్తకం వచ్చింది.దాని పేరు "ద లిటిల్ మాంక్ అండ్ అదర్ స్టోరీస్". పత్రికా సంపాదకునిగా,కథకునిగా,నాటక రచయితగా ,కాలమిస్ట్ గా గౌరహరి దాస్ గారు ఒరియా పాఠకులకు ఎంతో తెలిసినవారు,ప్రతి ప్రక్రియ లోనూ తనదైన ప్రత్యేక శైలి కలిగినవారు.

కోరాపుట్ అనే పేరు వినగానే ప్రకృతి దృశ్యాలు మన కళ్ళముందు మెదులుతాయి.అలాగే అక్కడి శ్రామిక జనుల వెతలూ గుర్తుకువస్తాయి.ఈ పుస్తకం లో మొత్తం 15 కథలు ఉన్నాయి.అవి అన్నీ కూడా వివిధ ఇతివృత్తాలతో కూడి ఉన్నాయి.మొదటి కథ కోరాపుట్ తో సంబంధం ఉన్న కథ.కొన్ని కథల గురించి ముచ్చటించుకుందాము.గౌరహరి దాస్ గారి కథల్లో ఒక మేజిక్ ఉంటుంది.ఏ ఒక్క కథ ఇంకో కథ లా అనిపించదు.ప్రతి చిన్న విషయం లోనూ మన కంటికి కనబడని ఏదో కొత్త కోణం ని మన ముందు నిలబెడతారు.

కథా వ్యూహం కూడా పఠిత ని నిలవనివ్వదు.చివరిదాకా వెళ్ళు అంటుంది.కొద్దిసేపటిలో కథ అవబోతుంది అనుకున్నప్పుడు "ఎండింగ్" తెలిసిపోయిందిలే అనిపిస్తుంది.కాని చివరి వాక్యాలకి వచ్చేసరికి ఊహించలేని ఒక ట్విస్ట్ ఇచ్చి మన పెదాలపై నవ్వుని తెప్పిస్తారు.ఎంతో సాధనతో,ఆలోచనా పటిమ తో గాని అలాంటి విద్య వస్తుంది.కొన్ని ముఖ్యమైన దృశ్యాల్ని ,మానసిక పరిస్థితుల్ని వర్ణిచేటప్పుడు మనల్ని పరకా ప్రవేశం చేయిస్తారు ఆ పాత్రల్లోకి.    

మొదటి కథ కోరా పుట్ గురించి చెప్పుకుందాం.పూర్ణిమ అనే అమ్మాయి హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ లో భువనేశ్వర్ నుంచి కోరా పుట్ వస్తూంటుంది.అక్కడ ఉన్నత అధికారిగా గా పనిచేసే ప్రశాంత్ అనే వ్యక్తిని ఈమె త్వరలో పెళ్ళి చేసుకోవల్సిఉంది. కోరా పుట్ లో రైలు దిగి,ప్రభుత్వ కార్యాలయాలు ఉండే జేపూర్ కి వెళ్ళడానికి టాక్సి ఎక్కుతుంది. విధివక్రించి ఈమెని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు.లోపల ఎక్కడో ఉండే ఓ గ్రామం లో ఈమె ని ఉంచుతారు.పారిపోవడానికి దారి తెలియదు.అక్కడ ఉండే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ఇంకా కొంతమంది ప్రజలు ఎలా జీవిస్తున్నారో అర్థమవుతుంది.

తాను పెళ్ళాడబోయే ప్రశాంత్ కూడా అవినీతి అధికారుల్లో ఒకడని తెలిసి హతాశురాలవుతుంది.అతని వద్ద నుంచి డబ్బు,కొన్ని ప్రయోజనాల్ని పొందిన తర్వాత గాని తీవ్రవాదులు ఆమెని విడిచిపెట్టరు.ఈ కథలో ఒరియా ,ఆంధ్రా బోర్డర్ లోని గిరిజనుల స్థితిగతుల్ని ,జీవనాన్ని కళ్ళకి కడుతుంది.కోరాపుట్ అందచందాల్ని వివరిస్తూంది.

"ఒన్స్ ద స్కై వజ్ బ్లూ" అనేది మరో విన్నూత్నమైన కథ. ఒక బంగ్లాదేశీ శరణార్ధ కుటుంబం ఒరిస్సా రాష్ట్రం లో ఎదుర్కునే వెతల్ని దీనిలో చిత్రించారు.షిరాజ్ ఇంకా టుటుల్ చిన్ననాటినుంచి స్నేహితులు.పై చదువు కోసం టుటుల్ వేరే రాష్ట్రం వెళ్ళిపోతాడు. షిరాజ్ మాత్రం తండ్రికి హెల్ప్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్న ఆ షాప్ లోనే కాలం గడుపుతుంటాడు.ఒక పెద్ద మాల్ ఆ దాపునే నిర్మించబడుతుంది. వాళ్ళు తమకి ఉన్న అర్ధ,అంగ బలం తో ఆ దగ్గరే ఉన్న చిన్న చిన్న షాపుల్ని కూడా కలిపేసుకుంటారు.నిజానికి అది ప్రభుత్వ స్థలం అయినప్పటికి చిన్న షాపుల యజమానులు ఏమీచేయలేకపోతారు. అప్పుడు టుటుల్ అది చూసి తన తండ్రిని హెల్ప్ చేయమని కోరుతాడు. తను ఆ చుట్టుపక్కల పేరున్న మనిషి.

ఇంత పెద్ద మాల్ ముందు అలాంటి చిన్న షాప్ లు ఉంటే ఎలా చెప్పండి. కావాలంటే మా షాప్ లో సేల్స్ మేన్ గా ఉద్యోగం ఇస్తాం అంటారు.చివరికి మాస్క్ వేసుకుని పిల్లల్ని ఎంటైర్టైన్ చేసే పని కల్పిస్తారు. ఒకప్పుడు అతి చవకగా దొరికే కూరగాయల్ని,కిరాణా సామాన్లని వాటిని ఎలా రేట్లు పెంచి అమ్ముతారు ,హైప్ చేయడానికి రకరకాల ఇంగ్లీష్ పేర్లని వాటికి ఎలా పెడతారు అనేది దీనిలో బాగా వివరించారు. మార్కెట్ ఎకానమీ లో పెద్దచేప చిన్న చేపల్ని మింగే పద్ధతి అంతర్లీనంగా ఉంటుందనే సత్యం మనకి తెలుస్తుంది.  

"ద మిరేజ్" అనే కథ రాజకీయుల్ని ఆశ్రయించి మనుగడ సాగించే గూండాల జీవితాల్ని చిత్రించింది.పన్ను అనే గూండా...ఆ చుట్టుపక్కల 12 గ్రామాలకి హడల్.ఎంతో జాగ్రత్తగా ప్రత్యర్థుల్ని మట్టి గరిపించే తను,ఒక యువతి పెట్టిన చిన్న పరీక్ష ని సవాలుగా తీసుకుని ,పాములున్న చెరువు లో కి దిగి తెల్ల కలువపూలు కోస్తూ విషనాగులు కి బలి అవుతాడు.ఈ కథ మొత్తం మనసు చేసే గారడిని మన ముందు పెడుతుంది.గ్యాంగ్ స్టర్ ల ఆలోచనా విధానాన్ని సూక్ష్మంగా వర్ణించారు గౌరహరి దాస్ గారు. పన్ను జీవితగమనాన్ని బాగా వాస్తవానికి దగ్గరగా చిత్రించారు.

"హేండ్ రైటింగ్" అనే కథ లో ఒక ఉపాధ్యాయుడు తన దగ్గర చదివిన ఇద్దరు విద్యార్థుల జీవితాల్ని గమనించి ఆశ్చర్యపోతాడు.స్కూల్ లో ఎంతో మంచిగా చదివి తన ఫేవరేట్ స్టూడెంట్ గా ఉండే ఓ పిల్లాడు పెద్ద పెరిగి ఉన్నత అధికారి అయ్యి సెక్రటేరియట్ లో ఉంటాడు.ఈ మేస్టారికి అవసరం పడి వెళ్ళగా కాయితం ఇచ్చి వెళ్ళండి అంటాడు,తర్వాత పట్టించుకోడు. నీ చేతిరాత బాగోదురా అని ఎప్పుడూ స్కూల్ లో తిట్టే మరో స్టూడెంట్ పెద్దయి కండక్టర్ అవుతాడు.కాని మేస్టారి పర్స్ పోయినప్పుడు మానవతా దృక్పథం తో తానే చార్జ్ పెట్టుకుని తాను పాత విద్యార్థిని అని గుర్తుచేస్తాడు. కాబట్టి చిన్నప్పుడు బాగా చదివేవాళ్ళందరికి గొప్ప హృదయం ఉంటుందని ఊహించుకోవడం తప్పని మేస్టారికి తెలుస్తుంది.

 'వేర్ హేజ్ సుదాం జెనా గాన్" అనే కథ, విదేశీ మదుపుదారులు ఎలా దేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటారు అనే విషయాన్ని వివరిస్తుంది.గరుడా అనే టివి కంపెనీ ఎలా విదేశీ నిధుల్ని సంపాదిస్తుంది,తన కార్యకలాపాల్ని విస్తరిస్తుంది చివరికి నిర్దయ గా ఉద్యోగుల్ని ఎందుకు తొలిగిస్తుంది అనే ప్రక్రియ ని తెలుపుతుంది.ఆ సంస్థ లో ప్యూన్ గా పనిజేసే సుదాం కి అసలు విదేశీ నిధులు ఎందుకు తీసుకోవాలి,మనకి ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది ,విదేశీయుల అవసరం లేకుండా మనం వ్యాపారం చేయలేమా ఇలాంటి సందేహాలు వస్తుంటాయి.

ఇవన్నీ ఎంతో కొంత తెలిసేసరికి సుదాం ని ఉద్యోగం నుంచి తొలిగిస్తారు.చివరన ఓ ట్విస్ట్ కూడా ఉంటుంది. గ్లోబలైజేషన్ అనే పేరు ఎక్కడ ఎత్తకుండా చాలా సింపుల్ సన్నివేశాలతో పెద్ద కార్పోరేట్ లు సైతం ఎలా తిప్పలు పడుతుంటాయో చక్కగా వర్ణించారు. ఇంకా మిగిలిన కథలు దేనికి దానికే ప్రత్యేకత కలిగినవి.ఒరియా సమకాలీన కథా సాహిత్యం లో వస్తోన్న అనేక మార్పుల్ని మనం ఈ కథాసంపుటి ద్వారా తెలుసుకోవచ్చు.

----- మూర్తి కెవివిఎస్   


     

Friday, April 21, 2023

వాట్సప్ ని జయించుట ఎట్లు...?

 వాట్సప్ ని జయించుట ఎట్లు, నీ స్వీయ అనుభవము నుండి కొన్ని సూచనలు చేయుము అని ఎవరైన ప్రశ్న సంధించినచో ఈ విధముగా నుడివెదను.

మిత్రమా, వాట్సాప్ చూడటానికి అలవాటు పడితే మళ్ళీ మానివేయడం అంత సులువు కాదు. ఎన్నోసార్లు మానివేయడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. ఎవరికైనా చెబితే నవ్వుతారు గాని ప్రస్తుతం మందు మానివేయవచ్చు ప్రయత్నించి,అలాగే స్మోకింగ్ ని కూడా మానివేయవచ్చు ప్రయత్నించి, దీని తస్సాదియ్యా వాట్సాప్ చూడకుండా ఒక్కరోజు ఉండమంటే నా వల్ల  కావట్లా. 

ఒకరోజు చాలా చాలెంజ్ గా తీసుకుని వాట్సాప్ ని 24 గంటలు చూడటం మానివేశాను. సరిగ్గా మా మిత్రుడు ఒకడు ఫోన్ చేసి ఆ మధ్య టూర్ కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు పెట్టా. ఇంకా చూడలేదా అన్నాడు. ఇంకేముంది వ్రత భంగం. ఆత్రుత గా వాట్సాప్ లో కెళ్ళిపోయాను. వెళ్ళేముందు అప్పటికీ అనుకున్నా ఒక్క పదినిమిషాలు చూసి కట్టిపారేయాలి అని . అబ్బే ...అదెక్కడ కుదిరింది....నిమిషాలు దొర్లుకుంటూ అలా పోతూనే ఉన్నాయి.తీరా చూస్తే గంట అయింది వాట్సాప్ లోనుంచి బయటకి వచ్చేసరికి. 

ఇక ఇలా కాదని ఎప్పుడు బయటకి వెళ్ళినా, కావాలని మొబైల్ ని మర్చిపోయి వెళుతున్నా. ఇది కొద్దిగా ఫలితం ఇస్తోందని చెప్పాలి. మనకి ఇంటికి వచ్చేంతవరకు ఎవరు ఫోన్ చేస్తున్నారు తెలియదు ప్లస్ అందుబాటు లో మొబైల్ ఉండదు గనక వాట్సాప్ ని గీకడం ఉండదు. ఏ మాటకి ఆ మాట వాట్సాప్ చూడని రోజున కళ్ళు మాత్రం మహా ఆరోగ్యంగా,హాయిగా ఉంటాయి.అది ఒప్పుకు తీరాలి. ఈ మర్చిపోయి వెళ్ళే విధానం నాకు బాగానే పని చేస్తున్నది. మరి మిగతా వారి అనుభవాలు ఏమిటో..?   


Friday, February 17, 2023

నా కేరళ యాత్రా విశేషాలు

 ఇటీవల కేరళ రాష్ట్రాన్ని పర్యటించాను. ఓ మిత్రుని ఆహ్వానం మేరకు వెళ్ళాను. ఈసారి తిరువనంతపురం. సరే ట్రివేండ్రం అని కూడా అంటారనుకొండి. గతం లో చాన్నాళ్ళ క్రితం కొట్టాయం వెళ్ళాను, మళ్ళీ ఈసారి ఇలా.అసలు ఈ రాష్ట్రం లో జీవించడానికి అలవాటు పడినవాళ్ళు వేరే చోట ఎలా జీవించగలరా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కంటికి ఎటు చూసినా చక్కటి ప్రకృతి శోభ.శుభ్రంగా,తగినంత స్థలం లో కుటీరాల్లా త్రికోణాకారం లో ఉండే ఇంటి పైకప్పులు,ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ సాగిపోయే ప్రశాంత జీవనం, చదువరితనం వల్ల మనిషి లో వచ్చే ఓ రకమైన పోలిష్డ్ నెస్ ఇలా ఎన్నో విభిన్నతలు ఆ రాష్ట్రం లో చూడగలం.మరి దీనికి భిన్నంగా నెగిటివ్ కోణం లేదా ఉండచ్చు లేదన్నది ఎవరు ? కాని అది కూడా చాలా పాలిష్డ్ గానే ఉంటుంది. అదే కేరళ ప్రత్యేకత,మతం వల్లనో కులం వల్లనో ఇక్కడ ఘర్షణ రేపడం చాలా కష్టం. ప్రజలు ఆ విషయం లో చాలా జాగరూతత తో ఉంటారు.



హోటళ్ళు,పరిశ్రమలు,మీడియా,ఇతర అనేకానేక వ్యాపారాల్లో ముస్లిములు,క్రైస్తవుల వాటా ఇతర రాష్ట్రాల తో పోల్చితే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది.మీరు అలా బయట తిరుగుతున్నా చాలు ఆ తేడా కనబడుతుంది.ప్రెస్ రోడ్ లో ఉన్న క్యూనైన్ అనే హోటల్ లో భోజనం చేస్తూ మెనూ చూస్తే చికెన్,మటన్,ఫిష్ తో బాటుగా బీఫ్ కూడా ఉంది.అక్కడే అని కాదు మీరు హిందూ హోటల్స్ కి వెళ్ళినా అలాంటి మెనూ కనబడుతుంది.సరే..తినడం అనేది ఎవరిష్టం వాళ్ళది. అవతలే ఉన్న అన్నమయం (పేరు బాగుంది గదా)  అనే హోటల్ లో ఓ రోజు భోంచేశాను. అక్కడ కిళి పరోటా అనే దాన్ని ఆర్డర్ ఇవ్వగా అరిటాకులో కర్రీ తో బాటు ఇచ్చారు.విప్పుకుని తిన్నాను.అదొక అనుభూతి. ఇక కొబ్బరి తో చేసే పుట్టు ,బఠాణీ కూర్మా కూడా బాగానే అనిపించింది.చిన్నా,పెద్దా హోటల్ అనే తేడా లేకుండా ప్రతిచోటా గోరు వెచ్చటి నీళ్ళని తాగడానికి అందుబాటు లో ఉంచడం మంచిగా అనిపించింది.    



తమిళనాడు లోని తిరుప్పూర్,కోయంబత్తూర్ జిల్లాలు దాటి పాలక్కాడ్ లో రైలు ప్రవేశించడం తో కేరళ లో అడుగు పెట్టినట్లయి అటూ ఇటూ ఎటు చూసినా కనువిందు చేసే పచ్చని ప్రకృతి ఆనందింపజేయసాగింది. ఆ పిమ్మట ఓట్టపాలెం,వడకంచెరి, కొల్లం,త్రిస్సూర్,ఇరెంజిలకుడి,చలకుడి,అంగామలి,అళువ,ఎర్నాకులం,కొట్టాయం,చెంగనస్సెరి,తిరువల్లా,చెంగనూర్,మావెలికర,కాయంకులం,కరుంగనపల్లి,కొల్లం,పరవూరు,వర్కాల,కడకవూర్ ఇలా ఒక్కో స్టేషన్ దాటుకుంటూ తిరువనంతపురం లో కి వచ్చాను. కేరళ లో రైలు పోతున్నపుడు బాగా పరిశీలిస్తే ఇళ్ళ ముందర గాని,రోడ్ల మీదగాని ఏదో ఊసులు చెప్పుకుంటూ జనాలు గుంపులు గా అసలు కనబడరు.నూటికి ఎనభై శాతం తలుపు దగ్గరకి వేసి ఉండి మనుషులు ఎవరూ ఇళ్ళ బయట కనబడరు.అయితే మిగతా రాష్ట్రాల్లో నాకు ఎక్కడా అలా కనబడలేదు. అదో గమ్మత్తు విషయం. 



నాకు ఓ నాలుగు నక్షత్రాల హోటల్లో బస కల్పించారు.అయితే ఒక్క రోజు మాత్రం దాంట్లో ఉండి ఒలీవియా అనే మామూలు హోటల్లోకి మారాను.సింప్లిసిటి,పరిశుభ్రత ఇళ్ళ నిర్మాణాల విషయం లో వీటినే సగటు మళయాళీలు అనుసరిస్తారు. ప్రతి ఒక్కరూ చదువుకునే రోజుల్లో ఏదో ఒక కళా రూపాన్ని అభ్యసిస్తారు.సంగీతం,డాన్స్,నటన, చిత్రకళ ఇలా ఏదో ఒకదాన్ని.అందుకనేనా...వివిధ చిత్రపరిశ్రమ లలో వెలిగిన హీరోయిన్లు అనేకమంది కనిపిస్తారు,మిగతా వాటితో బాటు అనిపించింది.చాలామంది తెలుగు వాళ్ళు పద్మనాభ స్వామి వారి గుడి కి వెళ్ళినపుడు కనిపించారు.



ట్రావెంకూరు పాలకులు నిర్మించిన ఈ గొప్ప కట్టడాన్ని చూసినట్లయితే చేర మరియు ద్రావిడ నిర్మాణ శైలి కలగలిసినట్లు అనిపిస్తుంది. ఈ పద్మనాభ స్వామి గుడిని చూసి చాలామంది వచ్చేస్తుంటారు గాని దీనికి పక్కనే ఉన్నా కోట ని,మ్యూజియం ని తప్పకుండా చూడాలి. ఈ కోట ని పుథెన్ మాలిక లేదా కుత్తిర మాలిక అని పిలుస్తారు.దీనిలో రమారమి 122 గదులు ఉన్నాయి.18 వ శతాబ్దం లో తిరునాళ్ మార్తాండ వర్మ కట్టించిన ఈ నిర్మాణం ని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అభివృద్ది చేశారు.దీనిలో ఆనాడు ఉపయోగించిన కత్తులు,కళాకృతులు,తాళపత్రాలు,పాత్రలు,కలప తోనూ ,పింగాణీ తోనూ చేసిన ఎన్నో రకాల వస్తువులు ఇంకా రకరకాల చిత్రకారులు వేసిన చిత్రాలు మనల్ని వేరే లోకానికి తీసుకుపోతాయి. ఇంకా ఎన్నెన్నో ఆనాటి దైనందిన జీవితానికి సంబందించిన వస్తువులు ఉన్నాయి. వీటన్నిటిని సేకరించి ఇంతలా కాపాడి నేటితరాలకి చూపెడుతున్న వీరు ధన్యులు అనిపించింది.



ఇక్కడున్న చిత్రాల్ని చూసి ఓ చోట మనం చప్పున ఆగిపోయి ఆలోచన లో పడతాము.అది ఏమిటంటే ట్రావెంకూర్ పాలకుడైన మార్తాండ వర్మ ముందు ఓ యూరోపియన్ మోకాళ్ళ పై కూర్చుని వినతి పత్రం ఇవ్వడం.దాని వద్దగల వివరాలు చదివితే కొలాచల్ అనే ప్రాంతాం లో డచ్ సైన్యాన్ని ఓడించి అనేకమంది సైనికుల్ని ఇంకా Eustachus De Lennoy అనే సైనిక అధికారిని మార్తండ వర్మ బంధించాడు.దానికి సంబందించిన చిత్రం అది.ఒక భారతీయ రాజు యూరోపియన్ సైన్యాన్ని ఓడించి పట్టుకోవడం చాలా అరుదైన విషయం కాని మన చరిత్ర పుస్తకాల లో ఇలాంటివి పెద్దగా కనబడవు.ఇది ఆగస్ట్ 10,1741 లో జరిగింది. 

ఇక దానికి పక్కన ఉండే మ్యూజియం కూడా తప్పక చూడదగినది. ఆ తర్వాత తరాలలో ప్రముఖులైన బలరామ వర్మ,రామ వర్మ ఇలాంటి వారు సేకరించిన వస్తువులు ఇంకా వాళ్ళు తీసిన ఫోటోలు ఉన్నాయి. దీనిలో స్వామి వివేకానంద ఫోటో కూడా ఉన్నది,ఆయన ఈ సంస్థానాన్ని సందర్శించినప్పుడు అప్పటి రాజుగారే ఈ ఫోటో తీశారని అక్కడి గైడ్ చెప్పారు. 1949 వరకు ఈ సంస్థానాన్ని పాలించిన ఈ రాజవంశం వారే ఇప్పటికీ పద్మనాభ స్వామి ఆలయానికి ట్రస్టీలు గా ఉన్నారు.ఇక్కడ ఉన్న బంగారం,విలువైన వజ్ర వైఢూర్యాల వల్ల పద్మనాభ స్వామి ఆలయం అత్యంత ధనవంతమైనదిగా పేరెన్నికగన్నది. 

ఈ గుడి ముందు ఉన్న వీధి అంతా బంగారపు షాపులే ఉన్నాయి. మిగతావి హోటళ్ళు,ఆఫీస్ లు ఉన్నాయి.స్వాతి తిరునాళ్ సంస్థానాధీశుని పేరు మీద ఓ సంగీత విద్యాలయం ఉన్నది. అక్కడున్న ఓ హోటల్ లో భోజనం కానిచ్చాను.యాలకులు,లవంగాలు,మిరియాలు,దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాల్ని కూరల్లో బాగా వాడారు.ఎంతైనా వాటికి మాతృ భూమి గదా.కొన్ని వీధుల్లో నడుస్తుంటే కూడా వీటి సువాసన ముక్కు పుటాల్ని తగులుతుంటాయి.మళ్ళీ ఎక్కడా...కూర్గు , అక్కడ కూడా అంతే,కొన్ని వీధుల్లో వాటి సువాసన గుబాళించి కొడుతుంది.బయట బస్తాల్లో పెట్టి అమ్మేవారు,ఇప్పుడెలా ఉందో తెలీదు మరి.

సరే..ఇప్పటికిది,గుర్తు వచ్చినప్పుడు ఇంకొన్ని మరోసారి. 

--- Murthy Kvvs